కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. 2018లో విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఏఎస్ఎన్సీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజారి అంగర రాంబాబు పర్యవేక్షణలో.. గ్రామంలో శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తైన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత నాలుగు రోజులుగా ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ నెల 4న ఆదివారం శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. శ్రీ లలితా కామేశ్వరి పీఠం స్వామీజీ శ్రీ ఆదిత్య ఆనంద భారతి స్వామి ఆధ్వర్యంలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర వేడుకలను సైతం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇక.. ఇదే క్షేత్రంలో 9వ శతాబ్దం నుంచి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఉందని పూజారులు తెలిపారు. తిరువూరుకు చెందిన శిల్పి ప్రస్తుత విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు.