నేలవాలిన పంటలు.. తడిసిన వరి పనలు...పొలాల్లో నిలిచిన నీళ్లు.. అన్నదాత బతుకుల్లో కన్నీళ్లు. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతులు తడిసిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏటా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరిస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో కురిసిన వడగళ్ల వాన తీరని విషాదాన్ని నింపింది. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వేలాది హెక్టార్ల పంట నేలవాలి నీళ్లలో నానుతోంది. పొలాల్లో నీళ్లు బయటకు తీసినా పంట దక్కేలా కనిపించడం లేదని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.
సర్వేకు ప్రత్యేక బృందాలు
వర్షాల కారణంగా నష్టపోయిన పంట అంచనా వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో 9,733 హెక్టార్లలోని పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి చూస్తే అంతకు మించి నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో వీఆర్వో, వ్యవసాయ సహాయకులు ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ పంట నష్టం అంచనాలు వేసేందుకు సిద్ధమయ్యాయి. అంచనాల్లో పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించి సమాయత్తం చేశారు.