పెట్టుబడి రూ.100... ఆదాయం రూ.50 వేలు
వ్యవసాయం అంటే నష్టాలు, కష్టాలు తప్పా ఏమి మిగలదనుకునే ఈ రోజుల్లో... ఓ రైతు వినూత్న రీతిలో పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని వదిలేసి ప్రకృతి సాగుతో ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కేవలం కిలో ఆవాలతో... ఐదు క్వింటాల్ల దిగుబడి సాధించారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామానికి చెందిన పేకేటి సీతారామిరెడ్డి... పాలేకర్ విధానాన్ని అనుసరిస్తూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నాడు. 10 ఎకరాల్లోని మినుమల పంటలో కిలో ఆవాలను అంతర సాగు వేశారు. రసాయనాలను వాడకుండా పాలేకర్ విధానంలో జీవామృతాన్ని ఎరువుగా వినియోగించారు. కిలో ఆవాలతో వేసిన పంట 5 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చింది. పచ్చళ్ల కంపెనీకి కిలో 100 రూపాయల చొప్పున పంట అమ్ముకుని ఆదాయాన్ని పొందారు.
పాలేకర్ విధానం పంటలన్నింటికీ అనువుగా ఉంటుందని సీతారామిరెడ్డి అంటున్నారు. ప్రతి రైతు పంట మార్పిడి చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. సీతారామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని చుట్టు పక్క గ్రామాల ప్రజలు... పాలేకర్ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు.