రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. నివర్ తుపాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినా.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు.. ఒక్క ఇటుక చేర్చలేదని బోడె ప్రసాద్ అన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా సంబంధిత లబ్ధిదారులను బెదిరిస్తూ.. వారి మాట వినకపోతే కేసులు బనాయిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. మాట తప్పను మడమ తిప్పనంటూ గద్దెనెక్కిన సీఎం జగన్.. ఏ మాట మీద నిలబడ్డారని నిలదీశారు. విద్యుత్, రవాణా, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని.. ప్రభుత్వం సాధించిన ఘనత ఇదేనని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నింటిని ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని బోడె పిలుపునిచ్చారు.