"మినరల్" మాటున దందా జరుగుతోంది. ప్రజల అమాయకత్వమే ఆసరాగా రోజుకో మోసం పుట్టుకొస్తోంది. అధికారుల ఉదాసీనత వ్యాపారులకు వరంగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటమవుతోంది. శుద్ధజల ప్లాంట్లలో నిబంధనలకు పాతరేయటం వల్ల ప్రజారోగ్యం గాల్లో కలుస్తోంది.
ఆ నీళ్లు తాగుతున్నారా.. ఒక్కసారి ఆలోచించండి!?
ప్రజారోగ్యంలో తాగునీటిది కీలకపాత్ర. అందుకే ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అందరి ఇళ్లలో మినరల్ క్యానే దర్శనమిస్తోంది. కాలనీకో వాటర్ ప్లాంటు పుట్టుకొస్తోంది. అయితే... ఆ నీళ్లు ఎంతవరకూ ఆరోగ్యకరం! అసలు అది శుద్ధజలమేనా!? మనిషి దేహంలో వస్తున్న మార్పులకు ఆ నీరూ ఓ కారణమేనా..!??
పుట్టగొడుగుల్లా...
మినరల్ వాటర్ అంటే పూర్తిగా ఫిల్టర్ చేసినవని, సురక్షితమని నమ్మేవాళ్ల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. రాష్ట్ర రాజధానికి నెలవైన కృష్ణా జిల్లాలో ప్లాంట్ల నిర్వహణ తీరు సగటు మనిషినీ కలవర పెడుతోంది. జిల్లాోల మొత్తం 1800 వాటర్ ప్లాంట్లు ఉండగా... 950కు పైగా అనుమతులు లేకుండా నడుస్తున్నవే. ఆయా ప్లాంట్లలో కమర్షియల్ విద్యుత్‌కు బదులుగా రెసిడెన్షియల్ కనెక్షన్లతోనే నడిపిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో... కనీస పరీక్షలు కూడా చేయని బోరు నీళ్లను క్యాన్లలో నింపి రూ.10-20కు అమ్మేస్తున్నారు.
పరీక్షల్లేవ్...
వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించాలంటే స్థానిక సంస్థల నుంచి ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్), పవర్ సప్లై, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, డీఐఎస్, బీఐఎస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఫుడ్ కంట్రోలర్ నుంచి నిర్వహణకు, క్వాలిటీకి చెందిన అనుమతులు లభిస్తాయి. కానీ ఇవేమీ లేకుండానే ప్లాంట్ల నిర్వహణ జరుగుతోంది. జిల్లాలో 47 లక్షల జనాభా ఉండగా.. వీరిలో 44.5లక్షల మంది మినరల్ వాటరే తాగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో వీరందరి ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..!
దేశంలో 50 రకాల అనారోగ్యాలకు తాగునీరు కారణమనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ వాటర్ ప్లాంట్లపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించటం బాధాకరం.
ఇదీ చదవండీ: రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధం!