ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్ముడి పేరిట సందేశం.. 2లక్షల రూపాయలకు టోపీ!

సోదరుడు అత్యవసరంగా సొమ్ము కావాలని వాట్సాప్‌ సందేశం పంపటంతో... అర క్షణం కూడా ఆలస్యం చేయకుండా డబ్బు పంపాడు. మరి కొంత సొమ్ము కావాలని మరో వాట్సాప్‌ సందేశం రావటంతో సందేహం కలిగింది. వెంటనే తన సోదరుణ్ని సంప్రదించగా తానెలాంటి సందేశాలూ పంపించలేదన్నారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల అవసరాలనే ఆసరా తీసుకొని... ఇటువంటి అక్రమ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. అమాయక ప్రజలకు ఇలాంటి వాట్సాప్‌ సందేశాలను పంపి సొమ్ము చేసుకుంటున్నారు.

Cyber ​​Crime Police have arrested two persons
తమ్ముడి పేరిట సందేశం.. 2లక్షల రూపాయలకు టోపీ

By

Published : Nov 13, 2020, 12:22 PM IST

అత్యవసర వైద్య సేవలకంటూ అమెరికాలో ఉండే సోదరుడి పేరిట ఇద్దరు సైబర్‌ మోసగాళ్లు వాట్సాప్‌ సందేశం పంపి ఓ వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలు కాజేశారు. నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ క్రైం ఏసీపీ శ్యాంబాబు కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగా రెడ్డి జిల్లా పేట్‌బషీరాబాద్‌కు చెందిన బాలముకుంద్‌ నాందేవ్‌కు ఈనెల 3న అమెరికాలో ఉండే తన సోదరుడు మహేందర్‌కుమార్‌ నాందేవ్‌ పేరిట, అతడి ప్రొఫైల్‌ ఫొటో ఉన్న వాట్సాప్‌ నంబరు నుంచి అత్యవసర సేవలకు వెంటనే 2 లక్షలు రూపాయలు పంపించాలని సందేశం వచ్చింది. సందేశంలో సూచించిన బ్యాంకు ఖాతా నంబర్లకు బాలముకుంద్‌ డబ్బులు బదిలీ చేశారు. కొద్ది సేపటికి మరో లక్ష రూపాయలు పంపించాలని మరో సందేశం వచ్చింది. వెంటనే తన సోదరుణ్ని సంప్రదించగా తానెలాంటి సందేశాలూ పంపించలేదన్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు ఈనెల 5వ తేదీన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖాతా, చరవాణి నంబర్లు, సాంకేతిక ఆధారాలతో సీఐ ఆర్‌.వెంకటేశ్‌, ఎస్‌ఐ ఎస్‌.రాజేందర్‌ దర్యాప్తు చేపట్టారు. ముంబయి తూర్పు ప్రాంతానికి చెందిన దీపక్‌ నందియాల్‌(42), మనీష్‌ అమృత్‌పాల్‌ రాజ్‌పోపట్‌లు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీపక్‌ ప్రధాన సూత్రధారి. అమాయక ప్రజలకు ఇలాంటి వాట్సాప్‌ సందేశాలను పంపించి డబ్బులు లాగుతూ వంచిస్తున్నాడు. ఈ వ్యవహారంలో బాధితుడు బాలముకుంద్‌ నుంచి డబ్బు పొందిన ఖాతాదారు మనీష్‌ కమీషన్‌ కింద 10 వేల రూపాయలు తీసుకుని మిగతావి దీపక్‌కు ఇచ్చాడు. వీరిద్దరినీ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి ఈనెల 9వ తేదీన రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details