ప్రభుత్వం విడతల వారీగా పాఠశాలలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేసింది. మూడు రోజులుగా కృష్ణాజిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, విజయవాడ అర్బన్ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఇతర ఆసుపత్రుల్లో మొత్తం 784మంది విద్యార్థులు, 26 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. గూడూరు మండలంలోని మల్లవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 మందికి, పెడన మండలంలోని చేవెండ్రపాలెంలో 180మందికి పరీక్షలు చేశారు. బందరు, పెడన, గూడూరు, అవనిగడ్డ, చల్లపల్లి తదితర మండలాల్లో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు కూడా పరీక్షలు చేశారు.
9,10 తరగతులకు తొలి ప్రాధాన్యం
వచ్చే నెల 2వ తేదీ నుంచి 9,10 తరగతుల పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఆలోపే ఆయా ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు పూర్తిస్థాయిలో కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. 6,7,8 తరగతులు ప్రారంభానికి నవంబరు 23వరకు గడువు ఉండటంతో వారందరికీ 9,10 తరగతుల వారు పూర్తయిన తరువాత పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్ వచ్చిన వారు చికిత్స తీసుకునేలా ఏర్పాట్లు చేసి, నెగిటివ్ వచ్చిన వారందరినీ పాఠశాలలకు అనుమతి ఇస్తారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో కూడా విద్యార్థులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు విధిగా ధరించాలి. పాఠశాల ఆవరణలోని తరగతి గదులు, ప్రయోగశాలలు అందరూ వినియోగించే ప్రదేశాలతోపాటు తరచుగా వాడే వస్తువులను శానిటైజేషన్ చేయించాలి. బల్లలు కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి. పాఠశాల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.