ఇసుక కొరతపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే అసంతృప్తి వ్యక్తమైన వేళ.. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వల్ల మూతపడ్డ ఇసుక రీచ్‌లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నట్లు అధికారులు జగన్‌కు తెలిపారు. వారం, పది రోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. బల్క్ ఆర్డర్ల పేరిట కొందరు గుత్తేదారులు ఇసుకను దారి మళ్లిస్తున్నారని తేలడంతో.. సీఎం కొన్ని కీలక సూచనలు చేశారు. బల్క్ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వాలన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించి.. అనుమతులను సంయుక్త కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. పోర్టల్ ఆన్ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయనే భావన పోగొట్టాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన.. బల్క్ బుకింగ్‌లకు సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా.. ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలని... డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలకు తావివ్వరాదన్న సీఎం.. నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలన్నారు. బుకింగ్ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఉంచాలన్నారు. ఎడ్ల బండ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని.. ఆదేశించారు. చిన్న చిన్న నదుల నుంచి పక్కన ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రమే ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లనివ్వాలన్నారు. ఒకవేళ ఎడ్ల బండ్లలో తీసుకెళ్లిన ఇసుకను నిల్వచేసి.. అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.