CLASHES BETWEEN TWO GOVT EMPLOYEES : వాళ్లిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులు. అందులో ఒకరు వీఆర్వో.. మరొకరు పోలీసు డిపార్టుమెంటులో లేడీ కానిస్టేబుల్. అయితే వారిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ కారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరు చేతిపైన కొరికితే.. మరొకరు చెంప చెల్లుమనిపించారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది: తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ అంగన్వాడీ కార్యకర్త.. వీఆర్వో అయిన తన భర్తతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. విజయవాడ వెళ్లడానికి రైలు ఎక్కే క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ రమాదేవి.. ఆ అంగన్వాడీ కార్యకర్తను అడ్డుకుంది. దీంతో అక్కడ చిన్నపాటి గొడవ మొదలైంది. నా భార్యను అడ్డుకుంటావా అంటూ వీఆర్వో అనిల్.. లేడీ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ నుంచి వెనుదిరుగుతుండగా.. కానిస్టేబుల్ అడ్డుకుంది. ఈ క్రమంలోనే వీఆర్వో చేతిని.. ఆ లేడీ కానిస్టేబుల్ కొరికింది. దీంతో ఆగ్రహం చెందిన వీఆర్వో.. కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరిగిన ఈ వివాదంతో ప్రయాణికులు నిర్ఘాంత పోయారు.
పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఉద్యోగుల పంచాయితీ: ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన ఘర్షణ.. గుడివాడ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అయితే ఇద్దరి మధ్య రాజీ జరిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాదాన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని టూ టౌన్ సీఐ తులసీదర్ వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.