Chandrababu letter to DGP : గన్నవరంలో దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు పట్టాభి, దొంతు చిన్నాకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. దాడి జరుగుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గన్నవరం పార్టీ కార్యాలయ సామగ్రి ధ్వంసం చేసి కార్లకు నిప్పు పెట్టారని, దొంతు చిన్నాకు చెందిన వాహనాలను తగలబెట్టారని తెలిపారు. టీడీపీ నేత పట్టాభిని కొందరు వ్యక్తులు అపహరించారని తెలిపారు. పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారా.. ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నా భర్త ఆచూకీ చెప్పండి... తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్కడికి తరలించారో కూడా చెప్పడం లేదంటూ టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి భార్య చందన ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలో పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందనే విషయం తెలిసి ఆయన అక్కడికి వెళ్లారని తెలిపింది. తన భర్తకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత వహించాల్సి ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పట్టాభి అరెస్టును వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఖండించారు. పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో బాధితులనే అరెస్టు చేయడం దారుణం అని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.