EC To Modify Symbols List Munugode Candidates: మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించిన ఈసీ.. విధినిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు మండిపడింది. శివకుమార్ ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి ఆ తర్వాత కనీసం ఎన్నికల పరిశీలకునికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా గుర్తు మార్చి బేబీవాకర్ ఇచ్చినట్లు తేల్చింది.
గుర్తు మార్పు విషయమై సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈసీ పేర్కొంది. లేని అధికారాన్ని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడం తగదన్న ఈసీ.. శివకుమార్ కు ముందు కేటాయించిన రోడ్ రోలర్‌కు కొనసాగిస్తూ ఫారం 7ఏను సవరించాలని ఆదేశించింది. సవరించిన ఫారం 7ఏను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించాలని ఈసీకి నివేదిక పంపాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఆర్వో లోపాలున్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం.. గుర్తుల కేటాయింపు వ్యవహారంలో మార్గదర్శకాలను పాటించలేదని ఆక్షేపించింది.
గుర్తు మారుస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. ఆర్వో వివరణ ఇవాళ సాయంత్రం అయిదు గంటల్లోగా కమిషన్‌కు చేరాలని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఈసీ తగిన నిర్ణయం తీసుకోనుంది. రిటర్నింగ్ అధికారిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత శివకుమార్‌కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ ఫారం 7ఏను సవరించారు. గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించడంతో పాటు బ్యాలెట్ పత్రం ముద్రణకు కూడా ఉపక్రమించారు.