ఆయేషా న్యాయపోరాట సమితి కన్వీనర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ విచారణలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం తలముందు భాగంలో రోకలి బండలాంటి వస్తువుతో దాడి జరిగిన కారణంగానే ఆయేషా మృతి చెందినట్లు తెలుస్తుండగా... పోస్టు మార్టం నివేదిక మాత్రం తల వెనుక భాగంలో గాయంతోనే మృతి చెందినట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆయేషా శరీరంపై ఇతర ప్రాంతాల్లో గాయాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో సీబీఐ అధికారులు విచారణ సాగిస్తున్నారు.
ఆయేషా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ఇప్పటికే కోరారు. సంఘటన జరిగిన 12 యేళ్లు గడిచింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు... కాబట్టి శరీరం ఎముకలు దొరికే అవకాశముంటుంది. శరీరంపై బలమైన గాయాలుంటే ఎముకలపై స్పష్టంగా కనపడే అవకాశం ఉందని... ఎముకలు ఎక్కడైనా విరిగినా తెలిసే అవకాశముంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.
క్షుణ్ణంగా సీబీఐ విచారణ
ఆయేషా కేసు పునర్విచారణను సీబీఐ 8 నెలల కిందట ప్రారంభించింది. కేసులో అనుమానితులుగా ఉన్న కోనేరు సతీష్ అతని స్నేహితులను ఇప్పటికే విచారించారు. ఈకేసులో నిందితునిగా జైలుకెళ్లి నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యంబాబును విచారించారు. వారి నుంచి సీడీలను, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఆయేషా హత్యా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులను విచారించారు.
కొద్ది రోజుల కిందట ఆయేషా తల్లిదండ్రులతో పాటు కేసులో అనుమానితులందరికీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు రక్తనమూనాలు సేకరించారు. మరోవైపు ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్‌ను , ఈ మెయిల్ ఐడీని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ కేసు గురించి సీబీఐ అధికారులకు వీటి ద్వారా సమాచారమందించాలని కోరారు. ప్రతి ఒక్క అంశాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.
శాస్త్రీయ ఆధారాలు సేకరించే దిశగా...
మరోవైపు ఆయేషా కేసులో సాక్ష్యాలు మాయమైన అంశంపై వేరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తుంది. రెండు సార్లు కోర్టు సిబ్బందిని విచారించారు. ఆధారాలు దగ్ధం చేయమని ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎప్పుడు దగ్ధం చేశారు? అనే అంశాలపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. 12 యేళ్ల తర్వాత జరుగుతున్న ఆయేషా హత్య కేసు పునర్విచారణ రాష్ట్రంలో ఆసక్తి రేపుతుంది. సీబీఐ అధికారులు మీడియా కంటపడకుండా అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నారు. నూతనంగా భౌతిక ఆధారాలు లభించటం కష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల శాస్త్రీయమైన ఆధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.