ఒకవైపు కరోనా.. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రక్తదానం చేసేవారు కరవయ్యారు. గతంలో రక్తనిధి కేంద్రాలకు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చే దాతలు ప్రస్తుతం పూర్తిగా లేకుండా పోయారు. కనీసం వారానికి ఒక్కరు కూడా రక్తదానం చేయడం లేదు. విజయవాడలోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లాంటి పెద్దవాటికే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉందంటే.. ఇక మిగతా వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు. రక్తనిధి కేంద్రాల్లో కొరత ప్రభావం ప్రధానంగా తలసేమియా బాధిత చిన్నారులపై పడుతోంది. కృష్ణా జిల్లాలో 350 మందికి పైగా తలసేమియాతో బాధపడుతున్న వాళ్లున్నారు. రక్తం కొరత కారణంగా వీరంతా ప్రస్తుతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. 15 రోజులకు ఒకసారి వీరికి క్రమం తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలి. లేదంటే అడుగు కూడా వేయలేని పరిస్థితి.
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులందరికీ అవసరమైన రక్తం అందించాలని ప్రభుత్వం కొన్ని రక్తదాన శిబిరాలకు బాధ్యత అప్పగించింది. విజయవాడలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు 40 మంది చిన్నారులను అప్పగించారు. వీరందరికీ అవసరమైన రక్తం 15రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇలాగే మిగతా వారిని మరికొన్ని కేంద్రాలకు అప్పగించారు. ప్రస్తుతం అన్ని రక్తనిధి కేంద్రాల్లోనూ తీవ్రమైన కొరత వేధిస్తోంది. కొందరు తలసేమియా బాధితులకు 15 రోజుల్లో రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ కొరత వల్ల ప్రస్తుతం ఒక్కసారి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. తలసేమియా బాధితులందరికీ రక్తం అందించడం సవాలుగా మారింది.
ఆరు నెలలుగా తీవ్రమైన కొరత..
కరోనా వల్ల గత ఆరు నెలలుగా రక్తం కొరత తీవ్రమవుతూ వస్తోంది. విజయవాడ సహా జిల్లాలోని ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలు మూతపడ్డాయి. రక్తనిధి కేంద్రాలకు ప్రధాన దాతలు విద్యార్థులే. విద్యాసంస్థల్లో ఒక్కసారి శిబిరం ఏర్పాటు చేస్తే వందల సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తారు. ఇప్పుడు వారు రావడం లేదు. తలసేమియా బాధితులతో పాటు గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసే సమయంలో రక్తం అవసరం. అలాంటప్పుడే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది.
గతంలో నెలకు కనీసం 500 యూనిట్లు..