ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

​ఆర్టీసీలో పొరుగు సిబ్బందిపై మళ్లీ వేటు

ఆర్టీసీలో పొరుగు సేవల సిబ్బందిపై మళ్లీ వేటు పడింది. లాక్‌డౌన్‌ నష్టాల దృష్ట్యా వారిని కొనసాగించలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. గురువారం నుంచి విధులకు రావొద్దని పొరుగు సేవల సిబ్బందికి ఆర్టీసీ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వారి బాధ్యతల్ని ఖాళీగా ఉంటున్న కండక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది.

apsrtc
apsrtc

By

Published : Jun 25, 2020, 5:10 AM IST

ఏపీఎస్ఆర్టీసీలో పొరుగు సేవల సిబ్బందికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత నెలలో వీరిని తొలగించి... విపక్షాలు, ఉద్యోగ సంఘాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఏపీఎస్​ఆర్టీసీ... తిరిగి అదే బాట పట్టింది. ఆర్థిక కష్టాల నేపథ్యంలో పొరుగు సేవల సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిబ్బందికి బుధవారం సమాచారం పంపింది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ బస్సు డిపోలు, కార్యాలయాలు, రీజినల్, ప్రధాన కార్యాలయాల్లో 7 వేల వరకు పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది డేటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. వీరందరినీ ఇవాళ్టి నుంచి విధుల్లోకి రావొద్దని... స్థానిక డిపోలు, రీజినళ్ల ఆర్టీసీ అధికారులు ఆదేశించారు. వారి స్థానంలో ఖాళీగా ఉన్న కండక్టర్లను వినియోగించుకోవాలని సంస్థ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ అధికారులకు ఈమేరకు ఆదేశాలు పంపింది. ఇవాళ్టి నుంచి పొరుగు సేవల సిబ్బంది బాధ్యతల్ని కండక్టర్లకు అప్పగించనున్నారు.

నిజానికి గత నెలలోనే వీరి తొలగింపునకు సంస్థ ఆదేశాలిచ్చింది. అయితే ఆందోళనకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. విపక్షాలు కూడా తొలగింపు సరికాదని తప్పుపట్టాయి. స్పందించిన మంత్రి పేర్ని నాని...వారిని కొనసాగిస్తామని అప్పట్లో తెలిపారు. అయినప్పటికీ కొద్ది రోజులుగా కొన్ని చోట్ల సిబ్బందిని తగ్గిస్తూ వచ్చారు. ఇక పూర్తిగా విధులకు ఎవరూ రావొద్దని బుధవారం ఆదేశాలిచ్చారు.

ఇంకా మే నెల వేతనాలు అందుకోని పొరుగు సేవల ఉద్యోగులను తిరిగి తీసుకుంటారా? లేదా? అనేది స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో చిరుద్యోగుల పొట్ట కొట్టకుండా, అందరినీ కొనసాగించాలని ఆర్టీసీ పొరుగు సేవల సిబ్బంది సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్​ బుధవారం ఓ ప్రకటనలో కోరారు.

ఇదీ చదవండి

ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు

ABOUT THE AUTHOR

...view details