ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ఎన్నికల కార్యదర్శి,  సీఎం ముఖ్య కార్యదర్శి మధ్య లేఖ  వివాదం - ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మధ్య వివాదం చెలరేగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సమావేశానికి హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్​ కుమార్​కు వర్తమానం వెళ్లడం వివాదానికి కారణమైంది. దీనిపై ఎస్​ఈసీ తీవ్రంగా స్పందించారని సమాచారం.

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar

By

Published : Oct 25, 2020, 5:36 AM IST

Updated : Oct 25, 2020, 10:26 AM IST

ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా పనిచేస్తున్నారు. అది హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఆయనకు... సర్వీసులో ఆయన కంటే చాలా జూనియర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అధికారి కార్యాలయం నుంచి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తున్నారని... దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హాజరవ్వాలన్నది వర్తమానం సారాంశం. అది చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఘాటుగా తిరుగు సమాధానం పంపించారని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సంబంధించి నిర్వహించే ఏ సమావేశాలకూ తన అనుమతి లేకుండా వెళ్లవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శినీ ఆదేశించారు. ప్రస్తుతం ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హైకోర్టులో తేల్చుకుంటా

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్ కుమార్ కార్యాలయానికి శనివారం ఒక వర్తమానం వెళ్లింది. ప్రవీణ్ ప్రకాష్ ఈ నెల 26న నిర్వహించే సమావేశానికి రమేశ్ కుమార్ హాజరవ్వాలన్నదే దాని సారాంశమని సమాచారం. అదే విషయాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శికి... ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయ సిబ్బంది ఫోన్ చేసి కూడా చెప్పారు. దీనిపై రమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారని... వెంటనే ఆయన తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయానికి ఒక లేఖ పంపించారని ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. మీరు పంపించిన వర్తమానాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టిలో ఉంచాను. దానిపై ఆయన ఆదేశం మేరకు మీకు ప్రత్యుత్తరం పంపిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు రాజ్యాంగబద్ధ పదవి. హైకోర్టు జడ్జితో సమాన హోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్​కి... ఒక సమావేశానికి హాజరవ్వాలని ఇలా హుకుం జారీ చేయడమే తీవ్ర అభ్యంతరకరం, అసంబద్ధం. అది బెదిరింపు ధోరణిలా ఉంది. మీ వైఖరి ఎన్నికల కమిషన్ స్వతంత్రకు, సమగ్రతకు భంగం కలిగించడమే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్​ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్​ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళతాం అని ఆ లేఖలో పేర్కొన్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

నా అనుమతి లేకుండా వెళ్లొద్దు

ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయానికి ఆ లేఖ రాసిన తర్వాత.. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్​కు రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ ఎన్నికలపై నిర్వహించే ఏ సమావేశానికి తన అనుమతి లేకుండా వెళ్లరాదని స్పష్టం చేసినట్లు సమాచారం. తాను ఈ నెల 26న విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

పొరపాటైందని ఫోన్

రమేశ్ కుమార్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లాక... ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం స్పందించినట్లు తెలిసింది. ఆ వర్తమానాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీ మోహన్ కార్యాలయానికి పంపించాలన్నది తమ ఉద్దేశమని, పొరపాటను ఎన్నికల కమిషనర్​కు వెళ్లిందని చెప్పినట్లు సమాచారం. అయితే ఆ వర్తమానాన్ని తనకే పంపించారని తాను నమ్ముతున్నానని, గట్టిగా బదులిచ్చేసరికి పొరపాటైందని చెబుతున్నారని రమేశ్ కుమార్ అభిప్రాయపడిటనట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ వారు చెబుతున్నట్లుగా వాణీమోహన్​కే ఆ వర్తమానం పంపారనుకున్నా... తన అనుమతి లేకుండా ఆమె ఎలా వెళ్లగలరని రమేశ్ కుమార్ ప్రశ్నించినట్లు సమాచారం.

Last Updated : Oct 25, 2020, 10:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details