రాబోయే ఐదేళ్లలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం వెళ్తుందని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. ఏపీ 30ఏళ్ల అప్పులకు సమానమని దుయ్యబట్టారు. 2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు.
రాష్ట్రం అత్యధిక గ్యారంటీస్‌లో 4వ స్థానం, అత్యధిక అప్పుల్లో 6వ స్థానంలో ఉంది. చేతగాని పాలనతో ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. విభజన తర్వాత ఏపీలో తెదేపా ప్రభుత్వ హయంలో ఏడాదికి సగటు అప్పు 26వేల కోట్ల రూపాయలు ఉంది. కానీ ఒక్క ఏడాదిలోనే దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. ఇవన్నీ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే.
ఏడాదికి 70వేల కోట్ల రూపాయల చొప్పున వచ్చే అయిదేళ్లలో 3,04,500 కోట్ల రూపాయల రుణభారం అదనంగా రాష్ట్రంపై మోపుతున్నారు. పాత అప్పులు కూడా దీనికి కలిపితే 2024నాటికి మొత్తం అప్పులు 6,54,500 కోట్ల రూపాయలకు చేరతాయి. చరిత్రలో లేనంత అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతోంది. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోనుంది అనడానికి ఇదే సంకేతం.