కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఈక్విటీ కింద 500 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పరిశ్రమ నిర్మాణం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను... ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. వాటితో చర్చలు కొనసాగించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.