Notices to People Do Not Have Votes in Kothapeta :మేము పరిశీలనకు వచ్చినప్పుడు ఆ చిరునామాలో మీరు లేరు. ఆ కారణంతో మీ ఓటు తొలగించేయవచ్చు. మీరు స్థానికంగా నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులను సంప్రదిస్తే మీ ఓటు కొనసాగుతుంది. స్పందించకపోతే ఎన్నికల నిబంధనల మేరకు మీ ఓటు తొలగిస్తామంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వేల మందికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటూ.. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి, విద్యుత్తు, ఇంటి పన్నులు చెల్లిస్తూ.. ప్రభుత్వ పథకాలు (Government Schemes)అందుకుంటున్న అనేక మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్థానికంగా, వేరే ప్రాంతాల్లోనూ మీకు రెండో ఓటు ఉందని వీటిలో దేన్ని తొలగించాలో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు.
"దొంగ ఓట్ల స్క్రీన్‌ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌దే - వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి"
Illegal Votes in AP :కొత్తపేట నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న పలువుర్ని ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు పలుకరించింది. రెండో ఓటు ఉందని నోటీసులు పేర్కొన్న ప్రాంతాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని వాపోతున్నారు. మోడేకుర్రు గ్రామానికి చెందిన నక్కా రాణి కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నక్కా రాణి, మోడేకుర్రు వాడపాలెం గ్రామానికి చెందిన అర్చకులు రామచంద్ర శ్రీహరి.. దశాబ్దాల తరబడి అదే ఊరులో ఉంటున్నా ఆయనకు ఓటు తొలగింపు నోటీస్ ఇచ్చారు. కొత్తపేటకు చెందిన సత్యవతికి రాజమండ్రిలో ఓటు ఉందని చెప్పారు.