మకాం మార్చిన పులి.. బిక్కుబిక్కుమంటున్న శంఖవరం మండల వాసులు - Tiger in Sankhavaram Region
Tiger in Sankhavaram Region: కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రత్తిపాడు మండలం నుంచి శంఖవరం మండలానికి మకాం మార్చిన పులి.. సమీప కొండల్లో దర్జాగా విహరిస్తోంది. స్థానికుల సమాచారంతో పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. నెల్లిపూడి మీదుగా కొంతంగి కొత్తూరుకు పులి వచ్చినట్టు గుర్తించారు.
కాకినాడ జిల్లాలోని గ్రామాల్లో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతోంది. తాజాగా.. శంఖవరం మండలంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రత్తిపాడు మండలం నుంచి శంఖవరం మండలానికి మకాం మార్చిన పులి.. గ్రామాల సమీపంలోని కొండల్లో దర్జాగా విహరిస్తోంది. కొంతగి కొత్తూరు కొండల వద్ద పులిని చూసిన ఇద్దరు గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. సాయంకాలం ఎర్రకొండ వద్ద ఓ వ్యక్తి పుల్లలు ఏరుకుంటుండగా... మరో వ్యక్తి పొలంలో జీడి పిక్కలు ఏరుకుంటున్నారు. దూరం నుంచి పులి కంటబడిందని గ్రామస్థులకు చెప్పారు. సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బందికి.. పులి పాదముద్రలు కంటపడ్డాయి. నెల్లిపూడి మీదుగా కొంతంగి కొత్తూరుకు వచ్చినట్టు అటవీ అధికారులు గుర్తించారు. త్వరగా పులిని పట్టుకోవాలని అటవీ బృందాన్ని స్థానికులు నిలదీశారు. అది అలా ముందుకు సాగి తోటపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి వెళ్తుందా.. లేదా వెనక్కి మళ్లి ప్రత్తిపాడు మండలం పోతులూరు దేవరేవడి మెట్టకు చేరుతుందా అనే ఆందోళన సమీప గ్రామాల్లో నెలకొంది. పలు సంచారంతో స్థానికులు భయం భయంగా తిరుగుతున్నారు.
ఇదీ చదవండి:అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి.. చిక్కదు.. వెళ్లదు