Telangana new secretariat: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరుగుతున్నాయి. భవనం అంతస్థులకు సంబంధించిన ప్రధాన కాంక్రీట్ పనులన్నీ కూడా గతంలోనే పూర్తయ్యాయి. ప్రస్తుతం భవనం ముందుభాగం ఎలివేషన్ పనులతో పాటు భవనంపైన గోపురాల పనులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ దోల్‌పూర్ నుంచి తీసుకొచ్చిన ఎర్ర ఇసుకరాతితో ఫ్రంట్ ఎలివేషన్ పనులు చేస్తున్నారు.
ఈ పనుల కోసం రాజస్థాన్ నుంచే ప్రత్యేకంగా కూలీలను తీసుకొచ్చారు. ఇసుకరాయిని అవసరమైన నమూనాగా సిద్ధం చేసుకొని వాటిని అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని.. ఇప్పటికే చాలా భాగం పూర్తైనట్లు చెబుతున్నారు. అటు భవనం పైభాగాన ఆకర్షణీయంగా గుమ్మటాలను ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంపైన మొత్తం 34 గుమ్మటాలు రానున్నాయి. ఇవన్నీ కూడా వివిధ పరిమాణాల్లో ఉన్నాయి.
అత్యంత చిన్న గుమ్మటం వ్యాసం 23 అడుగులు కాగా.. 27, 33 అడుగుల వ్యాసంతో ఇతర గుమ్మటాలు ఉన్నాయి. ఈ పరిమాణాలతో ఉండే 32 గుమ్మటాలను ఇప్పటికే సచివాలయం పైభాగాన ఏర్పాటు చేశారు. అందులో కొన్నింటికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తి కాగా.. మిగతా గుమ్మటాల పనులు కొనసాగుతున్నాయి. భవనం పైన ముందు, వెనకభాగాల్లో తూర్పు, పశ్చిమవైపున రెండు భారీ గుమ్మటాలు రానున్నాయి. ఈ రెండు 54 అడుగుల వ్యాసంతో, 27 అడుగుల ఎత్తుతో భారీ పరిమాణంలో ఉంటాయి.