Fishermen's Garjana : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని మత్స్యకార నాయకులు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాడేందుకే సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో మే 8న జరగబోయే మత్స్యకార గర్జన సభకు కాకినాడలోని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్లు స్థల పరిశీలన చేశారు.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల 8న మత్స్యకార గర్జన జరగనుంది. మత్స్యకార గర్జన సభకు టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడుతో పాటు పలువు పార్టీ నేతలు అతిథులుగా హాజరుకానున్నారు. సభకు ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందోనని నాయకులు పరిశీలన చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులు పాల్గొని స్థలాన్ని పరిశీలించారు. ఈ సభకు కాకినాడలో ఉన్న నియోజకవర్గాల నుంచి సుమారు 20వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్యంగా తుని, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో మత్స్యకారులు హాజరవుతారని తెలిపారు.
స్థల పరిశీలన సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు వర్మ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, తుని నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాయితీపై మత్స్యకార కుటుంబాలకు బోట్లు, ఇంజిన్లు, ఆయిల్ తదితర వస్తువులు ఇచ్చారని తెలిపారు. ఎవరైనా సముద్రంలో వేటకి వెళ్లి మరణిస్తే కొద్ది రోజుల్లోనే ప్రమాద బీమా అందించిన ఘనత, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.