ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుచరుల మంతనాలు.. పదవి మాకంటే మాకంటూ గట్టిపట్టు

గ్రామాల్లో సర్పంచి పదవులను కోరుకునే ఆశావాహుల సంఖ్య అధికార పార్టీలో ఎక్కువగా ఉంది. ఒక్కొక్క ఊరిలో ఇద్దరు ముగ్గురు రంగంలో ఉండటంతో ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు ఏకాభిప్రాయ సాధన కోసం వారితో చర్చిస్తున్నారు. దీంతో రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గుంటూరు జిల్లా నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లలోని ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

ysrcp leaders met with mlas  for local body elections at guntur district
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు

By

Published : Feb 1, 2021, 4:29 PM IST

అధికార పార్టీలో సీటు కోసం నేతల మధ్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో మంతనాలలో నిమగ్నమయ్యారు వారి అనుచరులు. గుంటూరు జిల్లా
నాదెండ్ల మండలంలో అతిపెద్ద పంచాయతీ సాతులూరులో ముగ్గురు పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే ఎమ్మెల్యే రజనీని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేర్వేరుగా కలిశారు. కనపర్రులో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్‌ అనుచరులు సర్పంచి పదవిని కోరుతుండగా ఎమ్మెల్యే అనుచరులు తమకే కావాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు.

నరసరావుపేట గ్రామీణ మండలంలోని కాకానిలో ఇద్దరు పోటీపడుతుండగా ఒకర్ని తప్పించేందుకు రెండు రోజుల నుంచి రాత్రి పూట మంతనాలు సాగిస్తున్నారు. గోనేపూడిలో నలుగురిలో ఒకరి పేరు ముఖ్య నేత చెప్పడంతో మిగిలిన ముగ్గురు అలకబూనారు. పెట్లూరివారిపాలెంలో ఇద్దరు, ములకలూరులో నలుగురు పదవిని ఆశిస్తున్నారు. వినుకొండ మండలం నరగాయపాలెంలో ఇరువురు పోటీపడగా అందులో ఒకరి పేరును ముఖ్య నేత ఆమోదించడంతో రెండో వ్యక్తి అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. చీకటీగలపాలెంలో తమకు సీటు కేటాయించాల్సిందేనని రెండు వర్గాలు గట్టిగా మాట్లాడుతున్నాయి.

మేజర్‌ పంచాయతీ రెంటచింతల సర్పంచి పదవిని ముగ్గురు ఆశిస్తూ ముఖ్యనేత ఆశీస్సుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ మహిళకు కేటాయించిన కారంపూడి బరిలో నిలిచేందుకు నలుగురు పోటీపడుతున్నారు. ఈనెల నాలుగైదు తేదీలలో అభ్యర్థిని తేల్చేందుకు అధికారపార్టీ ముఖ్య నేత ముహుర్తం పెట్టారు. మాచవరం మండలంలోని చెన్నాయిపాలెంలో ఆరుగురు, వేమవరంలో నలుగురు, శ్రీరుక్మిణీపురంలో ముగ్గురు అధిష్ఠానం అశీస్సుల కోసం పోటీపడుతుండగా, తొలుత గ్రామస్థాయిలో చర్చించి రావాలని సూచనలందినట్లు తెలిసింది. ఎక్కువ మంది ఆశావహులు ఉన్నప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఇందులో ఎందరు అవకాశాలు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి.లంక గ్రామాల్లో ఓటుకు అర్థమే వేరు.. ఎన్నికల్లో కట్టుబాట్లదే పైచేయి

ABOUT THE AUTHOR

...view details