YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa in AP: వైయస్సార్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ మేరకు 2022 అక్టోబరు – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు 38.18 కోట్ల రూపాయలను సీఎం జగన్ వర్చువల్ విధానంలో వారికి జమ చేశారు. అక్టోబరు- డిసెంబర్ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. జనవరిలో తనిఖీ పూర్తిచేసి వధూవరుల ఖాతాలలో నగదు జమ చేశామని సీఎం వెల్లడించారు. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే విధానంలో కార్యక్రమం అమలు చేస్తామన్నారు.
ఈ ప్రోత్సాహకం కోసం కనీసం పదో తరగతి వరకూ చదివి ఉండాలనీ నిర్దేశించినట్లు తెలిపారు. వయసు మాత్రమే కాదు, చదువు సైతం ఒక అర్హతగా ఈ పథకానికి నిర్దేశించామని సీఎం వివరించారు. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చుగా భావించడం లేదని తేల్చిచెప్పారు. పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు సైతం చదువుల బాట పట్టాలనే ఈ ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ఆడపిల్లలందరికీ మంచి జరిగేలా ఈ పథకం అమలు చేస్తామన్నారు.