Workers Stole Gold And Cash From The Owners House: అమ్మగారూ.. అయ్యగారూ అంటూ ఎంతో వినయంగా ఇంట్లో పనిచేసే ఇద్దరు దంపతులు.. వారింటికే ఎసరు పెట్టారు. విశ్వాసం మరిచి తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. యజమానుల ఇంట్లో నాలుగు సంత్సరాలుగా పనిచేస్తూ.. వారింట్లో ఉండే బంగారం, నగదుపై కన్నేశారు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భార్యాభర్తలిద్దరూ పథకం వేశారు. అనుకున్నట్లుగానే యజమానులు ఆదమరచి ఉన్న సమయంలో 400 గ్రాముల పైచిలుకు బంగారం, రూ.40 వేల నగదును చోరీ చేశారు. అనంతరం వారికేమీ తెలియనట్లుగా.. అదే ఇంట్లో పనిచేస్తూ ఉండేవారు.
అయితే బంగారం, నగదు చోరీకి గురైన విషయం తెలుసుకున్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే బంగారాన్ని పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
డీఎస్పీ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి ఐతానగర్ లింగారావు సెంటర్లో నన్నపనేని దుర్గా ప్రసాద్, హేమలత అనే ఇద్దరు వృద్ధ దంపతులు తమకు ఆసరాగా ఉంటారని ఇద్దరు భార్యాభర్తలను తమ ఇంట్లో పని మనుషులుగా పెట్టుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా రామావత్ కృష్ణ, చాందిని అనే భార్యాభర్తలిద్దరూ అదే ఇంట్లో పని చేస్తున్నారు. అయితే వారిద్దరూ ఎంతో నమ్మకంగా పని చేస్తున్నారని భావించిన వృద్ధ దంపతులు.. వారింటి ఆవరణలోనే ఓ షెడ్డు వేసి అందులో వారికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలిపారు. వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించారు ఆ వృద్ధ దంపతులు.
అయితే వారికి దుర్బుద్ధి పుట్టింది. యజమానులు వారి ఇంట్లో బీరువా తీసేటప్పుడు బంగారం, నగదు ఉండటాన్ని గమనించారు పనివారు. దీంతో వాటిని దొంగిలించేందుకు ఇద్దరూ కలిసి పథకం వేశారు. తమ యజమానులు ఆదమరచి ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న బీరువా తాళాలు తీసుకుని అందులో ఉన్న 400 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదును చోరీ చేశారు. అనంతరం వారికి ఏమీ తెలియనట్లుగానే నడుచుకుంటూ అదే ఇంట్లో వారి పనిలో వారు నిమగ్నమై ఉండేవారు.
అయితే ఈ నెల 11వ తేదీన ఇంటి యజమానుల కుమారుడు పవన్ కృష్ణ ఇంటికి వచ్చి.. వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం కోసం బీరువాలో దాచిపెట్టిన రూ.5 లక్షల నగదును పరిశీలించాడు. అయితే అందులో రూ. 40 వేలు తక్కువగా ఉన్నాయి. దీంతో నగదు గురించి తన తల్లిని ప్రశ్నించాడు. ఆమె ఆ నగదు తీయలేదని చెప్పి.. బీరువాను తనిఖీ చేయగా.. డబ్బులు పక్కనే దాచి ఉంచిన రెండు బంగారు గాజులు కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి రెండవ బీరువాలో పరిశీలించగా 400 గ్రాముల పైచిలుకు బంగారు నగలు మాయం అవటాన్ని గుర్తించారు. వేసిన తాళం వేసినట్టే ఉన్నా.. బంగారం ఎలా మాయమైపోయిందని అనుకున్న వారు.. పనివారిపై అనుమానం వ్యక్తం చేశారు. అది జరిగిన మరుసటి రోజు నుంచి దంపతులిద్దరూ పనిలోకి రావటం మానేశారు. దీంతో ఈ ఘటనపై యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పని మనుషులకు తప్ప బయటి వారెవరికీ ఆ ఇంట్లో ప్రవేశం లేదు. దీంతో దొంగతనం చేసింది పనివారేననే అనుమానం వచ్చిన పోలీసులు.. వారిని తెనాలి గోలిడొంక రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా దొంగతనం చేసింది తామేనని అంగీకరించారు. గత రాత్రి నిందితుల నుంచి దొంగిలించిన రెండు బంగారు బిస్కెట్లు, తొమ్మిది బంగారు గాజులు, మూడు బంగారు గొలుసులు, రెండు బంగారు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ స్రవంతి తెలిపారు. విలేకరుల సమావేశంలో టూ టౌన్ సీఐ వెంకట్రావు, ఎస్సై నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ నరసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
"తెనాలి ఐతానగర్ లింగారావు సెంటర్లో నన్నపనేని దుర్గా ప్రసాద్, హేమలత అనే ఇద్దరు వృద్ధ దంపతుల ఇంట్లో 400 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీంతో యజమానులు ఈ ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మేము కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నాము. అనంతరం వారి నుంచి సుమారు రూ. 20 లక్షలు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాము." - స్రవంతి, డీఎస్పీ