Why AP does not Needs Jagan: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖలో రైల్వేజోన్, కడపలో స్టీల్‌ప్లాంట్ వంటి రాష్ట్ర విభజన హామీల సాధనలో విఫలమైనందున రాష్ట్రానికి మీరే కావాలా జగన్? లేదంటే అధికారంలోకి వచ్చిన వారానికే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులను నమ్మించి నాలుగేళ్ల తర్వాత జీపీఎస్ అంటూ మాటమార్చినందుకా? మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్‌ను తగ్గించి అత్తెసరు పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా ఇచ్చినందుకా? లేక 2.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచినందుకా? సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ సిలబస్, టోఫెల్ అంటూ అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యను గందరగోళంలోకి నెట్టినందుకా? దళిత, గిరిజనులపై దాడులు, అకృత్యాలు పెరిగినందుకా? అసలెందుకు మళ్లీ మీకు అధికారం ఇవ్వాలి జగన్.
2021 జూన్‌కే పోలవరం (Polavaram Project) నుంచి నీళ్లిస్తామని ఓసారి, 2022 ఖరీఫ్ కల్లా అని రెండోసారి చెప్పిన జగన్.. తాజాగా ఆ గడువును 2025 జులైకి మార్చినందుకా? మళ్లీ మీకు అధికారం ఇవ్వాలా..? లేదంటే డయాఫ్రం వాల్, గైడ్‌బండ్(Polavaram Guide Bund), ఎగువ కాఫర్ డ్యాంలలో నీటి లీకేజీ వంటి అనేక సమస్యలకు ప్రాజెక్టును ఆలవాలంగా చేసినందుకా? పోలవరానికి సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం సాధించనందుకా? అసలు మీకు మళ్లీ ఎందుకు అధికారం ఇవ్వాలి..? అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఐదు ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఆ సంఖ్యను 28కి పెంచారు. వాటిలో ఒక్కటీ పూర్తి చేయనందుకా జగన్? మీకు మళ్లీ ఎందుకు అధికారం ఇవ్వాలి (Why AP Needs YS Jagan)..?
ఏపీని అప్పుల (AP Debts) కుప్పగా మార్చి, ప్రజలపై 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణభారాన్ని మోపినందుకా? మళ్లీ మీకు అధికారం ఇవ్వాలా..? వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి.. ఏపీ అంటేనే కాంట్రాక్టర్లు ముఖం చాటేసేలా చేసినందుకా? అప్పు తెస్తేకానీ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చినందుకు మళ్లీ మీకు అధికారం అప్పగించలా..? ఒకటో తారీఖున జీతమొస్తే చాలానుకునే స్థితిలోకి ఉద్యోగులను మీరు నెట్టేయలేదా? డీఏ 2వేల కోట్లు, ఆర్జిత సెలవులవి 12 వందల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపును వాయిదాలు వేస్తున్నది మీరే కదా జగన్.. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగేళ్లలో 16 విడతల్లో చెల్లిస్తామంటూ భారాన్ని వచ్చే ప్రభుత్వాలపై మోపుతున్నందుకా? మళ్లీ మీరే రావాలా..? ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి, కొద్దిమందికే వర్తింపజేస్తున్నందుకా? చిరుద్యోగుల జీతాలు నామమాత్రంగా పెంచి, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను దూరం చేసింది మీరే కదా జగన్..?
టీడీపీ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తామంటూ పెట్టుబడిదారులను బెదిరించి బయటకు పంపారు కదా! 70 వేల కోట్ల రూపాయలతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న అదానీ సంస్థ, 21 వేల కోట్ల రూపాయలకే ఎందుకు పరిమితమైంది? అమరరాజా బ్యాటరీస్‌పై ఎంతగా రాజకీయ కక్ష సాధించారు? ఆ సంస్థ ఏపీలో ప్రాజెక్టు విస్తరణను కాదని, తెలంగాణలో 9 వేల500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది కదా? కియా అనుబంధ యూనిట్లు రాకుండా చేసింది మీరే కదా ? లులూ సంస్థను విశాఖ నుంచి కోయంబత్తూరు, హైదరాబాద్‌కు తరిమేయలేదా? విశాఖలో పెట్టుబడుల సదస్సులో 13.12లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన మీరు.. వాటిలో కొన్నైనా రాబట్టారా?
ఏటా 12 వేల 500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిన జగన్.. ఏటా 7 వేల 500 చొప్పునే ఇస్తున్నందుకా? మిమ్మల్ని మళ్లీ గెలిపించాలా..? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీ కింద టీడీపీ హయాంలో 700 కోట్ల రాయితీలివ్వగా, ఇప్పుడా పంపిణీకి మంగళం పాడినందుకా? మళ్లీ ఎన్నుకోవాలా..? టార్పాలిన్లు, స్ప్రేయర్లూ ఇవ్వలేని ప్రభుత్వాన్ని రైతన్న ఎలా నమ్మాలి? ఉచిత సూక్ష్మపోషకాల పంపిణీకి పాతరేసి, సూక్ష్మసేద్యానికి మూడేళ్లూ ముసుగేసి, నాలుగో ఏడాదిలోనూ మొక్కుబడిగా అమలు చేస్తున్నందుకా?.లేక కౌలు రైతులను కులాల వారీగా విభజించి కొన్ని వర్గాలకే రైతు భరోసా ఇస్తున్నందుకా జగన్? మిమ్మల్ని మళ్లీ రైతుల గెలిపించుకోవాలా..?
చంద్రబాబుపై కోపంతో అమరావతి సర్వనాశనానికి కంకణం కట్టుకొని, మూడు రాజధానులంటూ నేడు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించినందుకా జగన్? మళ్లీ మీరు రాష్ట్రానికి కావాలా..? రాజధాని అమరావతికి భూములిచ్చిన 29 వేల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నందుకా? వారికి కౌలు కూడా చెల్లించకుండా, స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నందుకా? గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, రహదారులను గ్రాఫిక్స్‌గా ముద్రవేసి పాడు పెట్టినందుకా? కనీసం కరకట్ట రోడ్డునూ విస్తరించలేని అసమర్థతకా?