అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సకల జనుల సమ్మె, జాతీయ రహదారి దిగ్బంధం అనంతరం దుర్గమ్మకు పొంగళ్ల సమర్పణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ 30 చట్టం అమల్లో ఉన్నందున మూకుమ్మడి ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా.... వెనక్కి తగ్గేది లేదని రైతులు, మహిళలు ప్రతినబూనారు.
తుళ్లూరు నుంచి ఉద్ధండరాయునిపాలెం మీదుగా విజయవాడ వెళ్లాలనుకున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు వేసిన బ్యారికేడ్లు, ఇనుపకంచెలను రైతులు పక్కకు నెట్టేశారు. దీంతో నిరనసకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులకు లాఠీ పనిచెప్పగా... వారికి, రైతులకు తోపులాట జరిగింది.
ఇనుపకంచెను దాటే క్రమంలో కొందరు మహిళలకు గాయలవగా... ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. కొందరు నిరసనకారుల్ని పోలీసులు దొరికినవారిని దొరికినట్టే వ్యాన్‌లో పడేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే వారందరినీ అడ్డుకున్నామని... శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు స్పష్టం చేశారు.