TDP Strategy Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా చోటు చేటుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల వచ్చే వాతావరణం కనిపిస్తోందని టీడీపీ భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండాలని వ్యూహ కమిటీ సమావేశంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. పలు కీలక విషయాలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.
21 నుంచి సమావేశాలు షురూ:ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణుల్ని చైతన్యపరిచేందుకు ఈ నెల 21వ తేదీ నుంచి 5 రోజుల పాటు 5 జోన్లలో చంద్రబాబు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో తాజాగా నెలకొంటున్న పరిణామాలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు అనుగుణంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోయలేని అప్పుల భారం.. జీతాలు చెల్లించలేని దుస్థితి.. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి పాల్యెస్ వైపు చూపడం.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, ఎమ్మెల్యేల తిరుగుబాటులతో పాటు తదితర పరిణామాలు ముందస్తు ఎన్నికల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం వ్యూహ కమిటీ సమావేశం అభిప్రాయపడింది.
సీబీఐ కేసుల విచారణ వేగవంతంతోనే ముందస్తుకు: మార్చి తర్వాత కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే, ఒకటి రెండు నెలలు గడిపి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్న ప్రజాదరణకు వణికిపోయే.. ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ ఎన్నికల్లోపు వివేకా హత్య కేసు నిందితులెవ్వరో తేలిపోతుందని, ఆలోపే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిపై గతంలో ఉన్న సీబీఐ కేసుల విచారణ వేగవంతం కానుండటంతో ముందస్తుకు సిద్ధం అవుతున్నారన్నారు.