New Education System: గుణాత్మక విద్య లక్ష్యంగా జాతీయ నూతన విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. రాష్ట్రంలోనూ ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లాలోని 1553 ప్రాథమిక పాఠశాలల్లో 379 ఉన్నత పాఠశాలల్లో కొత్త విధానం అమలు కోసం ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యను నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యను రెండేళ్లపాటు బోధిస్తున్నారు. కొత్త విధానంలో ఫౌండేషన్ స్థాయిలో ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2, ఒకటో తరగతి, రెండో తరగతి ఉంటాయి. తొలి నాలుగేళ్ల విద్యాకాలాన్ని ఫౌండేషన్ స్కూళ్లుగా పిలుస్తారు.
3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు. ఇక్కడే సమస్య వచ్చింది. 3 కిలోమీటర్ల దూరంలోని హైస్కూళ్లలో వీరు విద్యనభ్యసించాల్సి ఉంటుంది. అంతదూరం విద్యార్థులు ఎలా వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. డ్రాపౌట్స్ ఏర్పడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య కోసం ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని.. ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని అధికారులు భరోసా ఇస్తున్నారు.