ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధం..త్వరలో సీఎంకు నివేదిక - tadepalli

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. విలీన ప్రక్రియకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై  విలీన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. సంస్థను లాభాల బాటలో పరుగులు పెట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలను... ముఖ్యమంత్రికి వివరించింది.

ఆర్టీసీ

By

Published : Aug 30, 2019, 6:52 AM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనానికి నియమించిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. కార్మికుల డిమాండ్లతో పాటు, సంస్థ లాభాల బాట పట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం జరిపింది. నిర్దిష్ట సిఫార్సులతో నివేదికను రూపొందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి అధ్యయన వివరాలు, సిఫార్సులను సభ్యులు వివరించారు. ప్రభుత్వంలో సంస్థ విలీన ప్రక్రియ సాధ్యమేనని కమిటీ తేల్చినట్లు తెలుస్తోంది.

రైల్వే తరహాలో విలీనం

సంస్థను విలీనం చేసేందుకు 5 విధానాలను నివేదికలో ప్రాధాన్యత క్రమంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రైల్వే తరహాలో ప్రభుత్వంలో విలీనం చేసే విధానానికి ప్రాధాన్యత కల్పించారని సమాచారం. సంస్థను ప్రత్యేక ప్రభుత్వ విభాగంగా గుర్తించి రాష్ట్ర రోడ్డు రవాణా విభాగంగా ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 53 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా కమిటీ ప్రత్యేక మార్గదర్శకాలు సిఫార్సు చేసింది.

విద్యుత్ బస్సుల వినియోగం

సంస్థను లాభాల బాటలో నడిపేందుకు గానూ డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు వినియోగించాలని ముఖ్యమంత్రికి వివరించింది. ఈ మేరకు వెయ్యి విద్యుత్ బస్సుల కొనుగోలుకు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్రం నుంచి 350 బస్సులు వస్తుండగా.. మిగిలిన వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్లాంట్ నెలకొల్పే సంస్థకే వెయ్యి బస్సులు సమకూర్చే పని అప్పజెప్పాలని కమిటీకి జగన్ సూచించారు. ఈ అంశాన్ని టెండర్లలోనూ చేర్చాలని వివరించారు. బస్సులు ఆర్టీసీ నిర్వహణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ముఖ్యమంత్రి జగన్ సూచనలను తుది నివేదికలో చేర్చనున్న కమిటీ... సమగ్ర నివేదికను సోమ, మంగళ వారాల్లో సీఎం ముందుంచనుంది.

ఇది కూడా చదవండి.

ప్రత్యక్ష పోరుకు తెదేపా సిద్ధం...నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details