రైతుభరోసా నిధుల్ని మే నెలలో అందించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. అమ్మఒడి, రైతుభరోసా పథకాలకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్ని పరిశీలించి.. అర్హులకు వెంటనే నగదు అందించాలని ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు.
మే నెలలో రైతు భరోసా: సీఎం జగన్ - ఏపీలో రైతు భరోసా వార్తలు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రైతు భరోసా నిధుల్ని మే నెలలో అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గానికో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పులివెందులలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
అరటి, బత్తాయి, టమాటా, కొబ్బరి, ఉల్లి, మామిడి రైతులకు మేలు జరిగేలా ఆహారశుద్ధి పరిశ్రమలు, శీతలనిల్వ సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. కోనసీమలో కొబ్బరిపై ఆహారశుద్ధి కేంద్రం, పులివెందులలో అరటి అనుబంధ ఉత్పత్తులకు ఒక సంస్థను ఏర్పాటుచేయాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగేయాలన్నారు. పులివెందుల ఐటీ కార్ల్‌లో వ్యవసాయ, పశుసంవర్థక కళాశాలలతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేయాలని చెప్పారు. సౌర ఆధారిత శీతల నిల్వ కేంద్రాల నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు చెప్పారు. మద్దతు ధరలు తెలియజేసేలా గ్రామ సచివాలయాలకు పోస్టర్లు పంపారా.. లేదా? అని సీఎం ఆరాతీశారు. గ్రామాల్లో మద్దతు ధరలు అమలవుతున్నాయో లేదో సచివాలయ ఉద్యోగులు పరిశీలించి.. వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. మద్దతు ధర కంటే తగ్గితే మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి వెంటనే అక్కడ ఉత్పత్తుల కొనుగోలు చేపట్టాలని నిర్దేశించారు.