రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో వరుసగా 36వ రోజూ రైతుల ఆందోళన కొనసాగింది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ నిరసనలు, ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. అమరావతి లేకుంటే ఆంధ్రప్రదేశ్‌కు మనుగడే లేదని ఎర్రబాలెంలో దీక్షలు చేస్తున్న మహిళలు పేర్కొన్నారు. అమరావతిని కాపాడుకోకుంటే ఆంధ్రులంతా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అమరావతే భవిష్యత్
అమరావతే తమ భవిష్యత్తు అని స్పష్టం చేసిన రైతులు... పిల్లాపెద్దా కలిసి నెలల తరబడి పోరాటం సాగించేందుకు సిద్ధమన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదనే దుగ్ధతోనే రాజధానిని తీసుకెళ్లిపోతున్నారని అన్నదాతలు ఆరోపించారు.
తూళ్లూరులో ఆందోళనలు
సీఎం జగన్ తీరుతో రాజధాని ప్రజలే కాకుండా, పోలీసులు సైతం నడిరోడ్డుపై రేయింబవళ్లు అష్టకష్టాలు పడుతున్నారని తుళ్లూరు రైతులు పేర్కొన్నారు.