No Development Works: కొత్త ఆస్తి పన్ను విధానంతో పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరిగినా.. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికార పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశాల్లో కోరుతున్నా, ఫలితం ఉండడం లేదు. పుర, నగరపాలక సంస్థల్లో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం కారణంగా కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో పలు పుర, నగర పాలికల్లో తాగునీటి పథకం నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. మధ్యలోనే ఆగిన రహదారి పనులు ముందుకు కదలడం లేదు. ఎక్కడికక్కడ నిలిచిన అసంపూర్తి నిర్మాణాల్ని పూర్తి చేసేందుకు ఒకటికి పదిసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు.
Tenders in Salur హతవిధీ..! 16 సార్లు టెండర్లు పిలిచినా.. ముందుకు రాని గుత్తేదారులు!
పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. అటు పూర్తైన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎమ్ఎస్లో అప్‌లోడ్ చేయడం వరకే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు. బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని కమిషనర్లు చెబుతున్నారు.
పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు మొదలుకావడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో 15 లక్షల రూపాయల అంచనాలతో 12 పనులకు అధికారులు 15సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. బిల్లుల చెల్లింపులు చేయని కారణంగా కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
Contractors Bills: రాష్ట్రంలో బిల్లుల గోస..! దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు..
రాష్ట్రంలోని అత్యధిక పుర, నగరపాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి. పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను ఆదాయం మూడేళ్లలో భారీగా పెరిగింది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానం తీసుకొచ్చిన తరువాత పాత బకాయిలతో కలిపి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. 2020-21లో పాత బకాయిలతో కలిపి ఇళ్లు, దుకాణాలు, భవనాల నుంచి ఆస్తి పన్ను డిమాండ్ 990.78 కోట్ల రూపాయలుగా ఉండేది. 2023-24 నాటికి 1,650.33 కోట్లకు పెరిగినట్లు అంచనా.
కొత్త విధానంలో ఏటా 10 నుంచి 15 శాతం వరకు ఆస్తి పన్ను ఆదాయం పెరగనుంది. కానీ సీఎఫ్ఎమ్ఎస్ వ్యవస్థకి అనుసంధానించిన పట్టణ స్థానిక సంస్థల పర్సనల్ డిపాజిట్ ఖాతాల నుంచి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యమవుతోంది. ప్రత్యేకించి ఇంజినీరింగ్ పనులకు బిల్లుల కోసం ఏడాదిన్నర నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి. పీడీ ఖాతాల్లో సమృద్ధిగా నిధులున్నా.. బిల్లుల్లో కదలిక లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో 750 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు 50 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
No Development Works: పన్నుల మీద ఉన్న శ్రద్ధ.. పనుల మీద లేదా..?