నిధుల కోసం ఆగని సర్పంచ్‌ల పోరు.. పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ముట్టడికి యత్నం Panchayat Raj department is besieged by sarpanchs: సమస్యల పరిష్కారం కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. సర్పంచులను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావు.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
ఎంతోకాలంగా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగాపోరాడుతున్న సర్పంచులు ఒక్కసారిగా కదం తొక్కారు. రాత్రి నుంచే గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేసినా.. వాటిన్నింటినీ దాటుకుంటూ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. భారీగా చేరుకున్న పోలీసులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సర్పంచులు రోడ్డుపైనే బైఠాయించి నిరసనతెలిపారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో.. కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్ర ఆందోళనలు, అడ్డగింతలు, అరెస్టుల మధ్య ఎట్టకేలకు సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. వారం రోజుల్లో నిధులు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సర్పంచ్‌ల అనుమతి లేకుండా నిధులు ఎలా తీసుకుంటారని ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నిధులివ్వకపోతే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపడతామంటూ ప్రశ్నించారు.
హిట్లర్ కంటే జగన్ పాలన దారుణంగా ఉంది..15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం మంజూరు చేసి రెండు నెలలవుతున్నా ఇంకా తమ ఖాతాల్లోకి వేయకపోవటాన్ని తప్పుబట్టారు. గత రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన రూ 8 వేల కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇవ్వటం లేదని.. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. స్థానికంగా అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. సర్పంచులను అరెస్టు చేయటాన్ని తప్పుబట్టిన నాయకులు.. ఈ రోజుని చీకటి దినంగా అభివర్ణించారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్ఛరించారు.బ్రిటీష్ పాలన కంటే, హిట్లర్ కంటే జగన్ పాలన వల్ల రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
మే నెల 15వ తేదీన రెండు విడతలుగా 9 వందల 88.6 కోట్లు వస్తే ఈ రోజు వరకు కూడా మా ఖాతాల్లోకి రాని పరిస్థితి.. సర్పంచ్‌లంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనిపై పూర్తిగా సీఎం బాధ్యత వహించాలి. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు కానీ మేము మా గ్రామానికి మేము ముఖ్యమంత్రిమే.. మీరు నిధులు ఇవ్వరు.. మా గ్రామాల్లో మమ్మల్ని హీనంగా చూస్తున్నారు.- పాపారావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు