గుంటూరు జిల్లా కొప్పురావూరులో.. జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే ఈ పోటీలకు.. ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వృషభ రాజాలు బరిలోకి దిగాయి. రెండు పళ్ల విభాగంలో గెలుపొందిన ఎద్దులకు రూ.30వేలు, 4 పళ్ల విభాగంలో రూ.35వేలు, 6 పళ్ల విభాగం విజేతలకు రూ.40 వేల చొప్పున బహుమతులను నిర్వాహకులు ప్రకటించారు.
వ్యవసాయ, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. సీనియర్స్ విభాగంలో గెలుపొందిన వృషభ రాజాలకు గరిష్టంగా రూ.లక్ష రూపాయల బహుమతి, రెండో స్థానంలో నిలిచిన ఎద్దులకు రూ.80వేలు, మూడో బహుమతి కింద రూ.60వేలు అందించనున్నారు. ఒంగోలు జాతి ఎద్దుల పోషణపై.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలను తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.