ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్రీడీ వీడియోలు చూసిన అనుభవం రెండు ప్రాణాలను కాపాడింది

వరద సృష్టించిన అడ్డంకులు ఆ నిండు చూలాలికి ప్రాణం మీదకు తెచ్చాయి. ప్రసవానికి వెళ్లేందుకు దారి లేక రెండు గంటల పాటు ఆమె నరకయాతన పడింది. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన అధికారులు కనీసం బోటు సమకూర్చటంలో విఫలమయ్యారు. స్థానిక యువతే స్పందించి ఆ చెల్లికి ధైర్యం చెప్పారు. ఓ యువకుడు ముందుకు వచ్చి మంత్రసానిలా పురుడు పోశాడు. కృష్ణానది గర్భంలో నడుము లోతు నీటిలో ఓ చిన్నారికి జన్మ.... ఓ నిండు గర్భిణికి పునర్జన్మ... కలిగిన వైనంపై ప్రత్యేక కథనం.

local youth stands for her pregnant woman in flood hardships and delivered her at guntur district
నిండు గర్భిణికి వరద కష్టాలు... అండగా నిలిచిన స్థానిక యువకులు

By

Published : Oct 16, 2020, 9:22 AM IST

నిండు గర్భిణికి వరద కష్టాలు... అండగా నిలిచిన స్థానిక యువకులు

వర్షానికి, వరదకు ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో హీరో తన తెలివితేటలతో, అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి... హీరోయిన్ సోదరికి పురుడు పోస్తాడు.....ఇది స్నేహితుడు సినిమాలోని సీన్‌. అది సినిమా కాబట్టి సరే. నిజంగా వైద్యం తెలియని వ్యక్తి ప్రసవం చేయగలడా అంటే సందేహమే. కానీ గుంటూరు జిల్లాలో దాదాపు అలాంటి ఘటనే జరిగింది. కృష్ణానది వరద ఉద్ధృతి కారణంగా లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొల్లూరు మండలంలోని ఈపూరు లంక కూడా అందులో ఒకటి. ఈ గ్రామానికి చెందిన ప్రసన్న అనే మహిళ నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే దాదాపు 300 మీటర్ల మేర వరద ప్రవాహం ఉండటంతో గర్భిణీని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎలాంటి వాహనాలు కూడా ప్రవాహం దాటే అవకాశం లేదు. దీంతో కొందరు స్థానికులు మండల స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి బోటు ఏర్పాటు చేయాలని కోరారు. వాళ్లు పంపిస్తాం అంటున్నారే తప్ప బోటు రాలేదు.

త్రీడీ వీడియోలు చూసిన అనుభవంతో...

ఆమె బాధను చూడలేని కొంతమంది యువకులు ఆమెను మంచంపై ఉంచి వరద దాటించేందుకు సిద్దమయ్యారు. కానీ కొంచెం దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా మహిళ చుట్టూ వెనక్కు తిరిగి నిలబడ్డారు. ప్రసన్న వెంట ఆమె తల్లి ఉన్నప్పటికి ఆమెకు ప్రసవం చేయటంపై అవగాహన లేదు. ఈ పరిస్థితుల్లో గోపికృష్ణ అనే యువకుడు ముందుకు వచ్చాడు. ప్రసవానికి సంబంధించిన త్రీడి వీడియోలు చూసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. అన్నలా ఆ గర్భిణికి ధైర్యం నూరిపోశాడు. వైద్యుడిలా మారి బిడ్డను బయటకు తీశాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ తల్లిని కాపాడాలనే తాపత్రయమే ముందుకు నడిపించిందని గోపికృష్ణ తెలిపారు.


చాకచక్యంగా బొడ్డును కూడా కోశాడు

ప్రసన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చి, వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నవేళ ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి క్షేమంగా అడుగుపెట్టింది. ప్రసవం చేయటం ఓ ఎత్తయితే పాపకు బొడ్డు కోయటం మరో ఎత్తు. ఆ పని కూడా గోపికృష్ణ చాకచక్యంగా చేశాడు. అనంతరం కొల్లూరు కరకట్ట వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.

అధికారుల నిర్లక్ష్యం

విపత్తుల సమయంలో వరద ప్రాంతాల్లో బోట్లు, మరపడవలు సిద్ధం చేసుకుని ఉండటం అత్యవసరం. కానీ అధికారులు దాన్ని విస్మరించారు. ఘటన జరిగిన తర్వాత ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. స్పీడ్ బోటు ముందుగానే అక్కడ ఉంటే ఆ తల్లికి అంత కష్టం తప్పేదని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి:

విజయవాడలో ఘాతుకం.. యువతిని చంపిన ప్రేమోన్మాది

ABOUT THE AUTHOR

...view details