Lack of facilities in Hospitals: విశాఖలోని కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, విజయవాడ బోధనాసుపత్రుల్లో గుండె శస్త్ర చికిత్సలు స్తంభించాయి. వైద్యుల నియామకాలకు తగ్గట్లు యంత్రాలు, పరికరాలు, కన్జుమబుల్స్ లేకపోవడంతో గుండె శస్త్ర చికిత్సలు, వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన కార్డియో థొరాసిక్ సర్జన్లు వాటి జోలికి వెళ్లడం లేదు. దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే ప్రభుత్వాసుపత్రులకు కూడా ఫీజుల రూపంలో నిధులు సమకూరతాయి. ఈ దిశగా పట్టించుకొనే వారు కరవయ్యారు. బోధనాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయించుకోవాలని వైద్యులు చెప్పిన తరువాత రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
విశాఖలోని.. కేజీహెచ్‌లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో ముగ్గురు వైద్యులు పని చేస్తున్నారు. కేజీహెచ్‌లో గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగం చాలా కాలం నుంచి నడుస్తోంది. గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీలు, వాల్వ్ రీప్లేస్‌మెంట్ చికిత్సలు ఈ విభాగంలో చేయాలి. ఇవి చేయాలంటే.. టెంపరేచర్ కంట్రోల్ మిషన్, హార్ట్ లంగ్ మిషన్ ఉండాలి. ఇవి రెండు, మూడు నెలల నుంచి పని చేయడం లేదు. వాటి స్థానంలో కొత్తవి సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సుమారు 30 మంది రోగులు బైపాస్ సర్జరీలు, వాల్వ్ రీప్లేస్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేజీహెచ్‌లో రెండేళ్ల నుంచి ఎమ్మారై కూడా పని చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని, జిల్లా కలెక్టర్ మల్లికార్జున తరచూ కేజీహెచ్‌ను సందర్శిస్తుంటారు. కానీ.. రోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు.
విజయవాడ.. జీజీహెచ్‌లో కార్డియో థొరాసిస్ సర్జన్లు ముగ్గురున్నారు. విభాగానికి ఇంఛార్జి హెచ్‌వోడీగా అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవహరిస్తున్నారు. మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లున్నారు. శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన ఇంట్రా అరోటిక్ బెలూన్ పంప్, యాక్టివేటెడ్ క్లాటింగ్ మిషన్ కూడా ఉంది. ఇక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఒక్క శస్త్రచికిత్స తప్పితే ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా జరగలేదు. మరోవైపు వాల్వ్‌ల పంపిణీ సంస్థతో ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఒప్పందం చేసుకోలేదు. అందుకోసం నిధుల కేటాయింపు జరిగితేనే తదుపరి చర్యలు ఉండనున్నాయి. బైపాస్ సర్జరీ చేయాలంటే... వాడిపారేసే కన్జుమబుల్స్, ఇతర సామగ్రి అవసరం. వీటిని భారీగా కొనుగోలు చేస్తేనే శస్త్రచికిత్సలు ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి కార్డియో థొరాసిక్ సర్జన్లు ఊపిరితిత్తుల సర్జరీలకే పరిమితం అవుతున్నారు.