అమ్మా, నాన్నలను చూపించండి... ప్లీజ్! - galimpu
అమ్మా అని పిలిచినా... ఆలకించవేమమ్మా! పాట విన్నారుగా... సరిగ్గా ఇలాగే గుంటూరులో ఓ యువకుడు 11 ఏళ్ల క్రితం తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఇన్నేళ్లు ఎక్కడెక్కడో పెరిగి గుంటూరు చేరి వారి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఓ యాచకురాలి చేతిలో అపహరణై 17 ఏళ్ల వయస్సులో కన్నవాళ్ల కోసం గాలిస్తున్నాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియక... గుంటూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు.
తల్లిదండ్రుల కోసం ఆరాటం
తల్లిదండ్రుల కోసం ఆరాటం
ఇన్నేళ్లైనా కన్నవాళ్ల కోసం అన్వేషణ ఆపలేదీ నాగేంద్రప్రసాద్. ఊరుపేరు తెలియదు.. తల్లిదండ్రుల పేర్లు మాత్రం లక్ష్మీదేవి,కొండయ్యగా చెబుతున్నాడు. గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న గుర్తులు తెలుపుతున్నాడు. వరంగల్ హాస్టల్లో చేరేటప్పడు తీసుకున్న పొటోలు చూపించి గుంటూరులో ప్రతి ఒక్కర్నీ అడుగుతున్నాడు.
ఎంతగా గాలిస్తున్నా కన్నవాళ్ల ఆచూకీ తెలియక... గుంటూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లిదండ్రులను చూపించాలని వేడుకుంటున్నాడు. అరుదైన ఈ కేసుని విని ఆశ్చర్యపోయిన పోలీసులు తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్న ప్రేమాభిమానాల్ని చూసి మురిసిపోయారు. అప్పటి అదృశ్య కేసులు, జనాభా, ఓటర్ల జాబితాలను సరిపోల్చుతున్నారు. నాగేంద్రప్రసాద్‌ను తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామంటున్నారు ఎస్పీ విజయరావు.