Jagan's photo on government certificates : సొమ్మెకరిది, సొకు మరొకరిది అంటే ఇదేనేమో! పంచాయతీ కార్యాలయాల్లో అంబేడ్కర్ స్థానంలో జగన్ ఫొటో, పాస్ బుక్కులపై జగన్ ఫొటో, పాఠశాల విద్యార్థులకు పంచే చిక్కీలపైనా అదే బొమ్మ, ఆఖరికి అంగన్ వాడీ కోడిగుడ్లపైనా జగన్ చిత్రాన్ని ముద్రించడం అధికారులకు అలవాటైపోయింది. సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం లోగో, ప్రధాని మోదీ ఫొటో ఉండడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం కూడా ఉండడం లేదు. సర్వం జగన్మయం అన్నట్లుగా సంక్షేమ పథకాల కరపత్రాలు, అధికారులు జారీ చేసే సర్టిఫికెట్లపై సీఎం జగన్ ఫొటో మాత్రమే హైలైట్గా నిలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో జగన్ ఫొటో వివాదాస్పదం కాగా, తాజాగా ప్రభుత్వం జారీ చేసే కుల, ఆదాయ, స్థానిక, జనన ధ్రువీకరణ పత్రాల పైనా జగన్ ఫొటో ముద్రించడంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ధ్రువపత్రాలపై జగన్ ఫొటో- దాఖలైన పిల్
ఎస్సీ, ఎస్టీలకు జారీచేసే కుల, స్థానికత (నేటివిటీ), పుట్టుక తేదీ ధ్రువపత్రాల పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటోతో పాటు నవరత్నాల పథకం లోగోను ముద్రించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిలకు నోటీసులు జారీచేసింది. విచారణను 8వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Chikki with CM photo: చిక్కీలపై సీఎం బొమ్మ...ప్రభుత్వంపై అధిక భారం