పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు:హోంమంత్రి - home_minister
పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
గుంటూరు పోలీసు పెరేడ్ మైదానంలో డాక్టర్స్ డే సందర్భంగా యోగా కేంద్రాన్ని ప్రారంభించారు హోంమంత్రి సుచరిత. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన ఆమె అనంతరం... ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించామని... ముఖ్యమంత్రితోనూ మాట్లాడనున్నట్లు వివరించారు. మహిళా పోలీసులు బయటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వైద్య కుటుంబం నుంచి వచ్చిన తనకు వైద్యుల దినోత్సవంలో పాల్గొనే అవకాశం రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులపై జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.