పర్వతారోహణ...! ప్రాణాల్ని పణంగా పెట్టడమే కాదు... ఖర్చూ అంతేస్థాయిలో ఉంటుంది. అందుకే కొద్దిమందే ధైర్యం చేసి ఎంచుకుంటారు. అలాంటి సాహసమే చేశాడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్. కిలిమంజారో పర్వతం అధిరోహించిన ఈ యువకుడు... ఇటీవల స్టాక్ కాంగ్రీ పర్వత శిఖరాన్ని ముద్దాడాడు. దాతల సాయంతో చైనా టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని... స్టాక్ కాంగ్రీ శిఖరాన్ని ఆగస్టు 15న అధిరోహించాడు సాయికిరణ్. 6,250 మీటర్ల ఎత్తైన పర్వతయాత్రను మైనస్ 20 డిగ్రీల ఉష్టోగ్రతల మధ్య 4రోజుల్లోనే పూర్తి చేశాడు. ఆ శిఖర అంచుల్లో 365 అడుగుల భారతీయ పతాకం ఎగరేసి చరిత్రలో భాగమయ్యాడు.
చిలకలూరిపేటలోని ఎంవీఆర్ కాలనీకి చెందిన ఆలూరి స్కైలాబ్, శ్రీదేవి దంపతుల రెండో సంతానం సాయికిరణ్. చిన్నతనం నుంచే అతనికి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. గణపవరం సీఆర్ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న ఈ కుర్రాడు... పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనుకున్నాడు. కళాశాల వ్యాయామ అధ్యాపకుడు బుజ్జిబాబు వద్ద ప్రాథమిక శిక్షణ తీసుకొని.. తెలంగాణలోని భువనగిరి, సిక్కింలో ప్రత్యేక తర్ఫీదు పొందాడు. ఎత్తైన ప్రదేశాల్లో... ఆక్సిజన్ తక్కువ ఉండే ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలపై అవగాహన పెంచుకున్నాడు.
చుండి రంగనాయకులు, కళాశాల యాజమాన్యం, దాతలు కలిసి చేసిన సాయంతో ఈ ఫిబ్రవరిలో ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతం, ఆగస్టులో స్టాక్ కాంగ్రీ పర్వత శిఖరం చేరుకున్నాడు. 6నెలల వ్యవధిలో 2పెద్ద పర్వతయాత్రలు పూర్తి చేశాడు.