విద్యుత్ నిత్యావసర వస్తువే.... అయినప్పటికీ ఎక్కడా దాచుకోవడానికి వీల్లేదు. నిరంతర ప్రవాహంలోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోల్చితే తలసరి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్త కొత్త విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు తయారవతున్నాయి. కొందరికి బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి తలెత్తుతోంది. విద్యుత్ పరికరాల వాడకంపై కొందరు వినియోగదారుల్లో అవగాహన లేకపోవడం వల్లే విద్యుత్ వృథా, ఛార్జీల భారం తప్పడం లేదని నిపుణులు అంటున్నారు.
ఇలా చేస్తే ఆదా
విద్యుత్ జాతీయ సంపద. ఇళ్లలోనే కాకుండా వ్యవసాయం, పారిశ్రామికరంగాల్లోనూ విద్యుత్ ఆదా చేయాల్సిన అవసరముందంటున్నారు నిపుణులు. పాత మోటార్ల స్థానంలో కొత్త ఎనర్జీ మోటార్లు, మోటార్లకు కెపాసిటర్లు బిగించడం ద్వారా ఇంధనం ఆదా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే త్రీ స్టార్ లేదా ఫైవ్ స్టార్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం వల్ల 50 శాతం వరకు విద్యుత్ ఆదా కానుంది.