నీటమునిగిన రహదారులు, పొలాలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వర్షం కారణంగా.... పలు ప్రధాన రహదారులు గోతుల మయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం,రావులపాలెంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు సైతం పెద్ద పెద్ద గోతులుపడ్డాయి. వాటిలో వర్షం నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పల్లపు ప్రాంతాలు, పాఠశాల ఆవరణలో కూడా వర్షం నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కోనసీమ ప్రాంతంలో వర్షాలకు వరి చేలు పడిపోతున్న తీరు రైతులను ఆందోళనకు గురి చేస్తుంది వర్షాలు ఇలాగే కొనసాగితే అపారమైన నష్టం వస్తుందని రైతులు మదనపడుతున్నారు.
ప్రహహిస్తున్న డ్రైనేజీలు
కృష్ణాజిల్లా అవనిగడ్డలోని రత్నకోడు డ్రైన్, గుండేరు, ఉప్పుకాలువ, మంగలేరు, మేకల కాలువ, మంగలివాని సింకు మొదలైన మురుగు డ్రైన్లు వర్షం నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు వర్షం వలన ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు, రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మ్యాన్ హోల్స్ మూసివేయాలి
గుంటూరులోని రహదారులు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. గతంలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి కాకుండా వదిలివేయటంతో మ్యాన్ హోల్స్ గుంతల్లో భారీగా నీరు చేరి పొర్లుతున్నాయి. ఎవరికి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొంతమంది స్థానికులు రాళ్లను అడ్డుగా పెట్టి వాహనదారులను,పాదచారులను అప్రమత్తం చేస్తున్నారు.అధికారులు మ్యాన్ హోల్స్ మూసివేయాలని కోరుతున్నారు.