ఆ తూర్పు, పశ్చిమ చాలా ఘాటు గురూ! - గుంటూరు పశ్చిమం
ఎన్నికల భేరీ మోగిన తర్వాత గుంటూరు రాజకీయమే ఒక్కసారిగా రాజకీయం ఘాటైంది. గుంటూరు నగరం పరిధిలోని 2నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారుపై ప్రధాన పార్టీలు తపస్సు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచే ఈ స్థానాల్లో ఎవరు విజయతీరాలకు చేరుతారోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తేనే అధికారం ఖాయమన్న నమ్మకం... అందర్నీ పరుగులు పెట్టిస్తోంది.
గుంటూరు అభ్యర్థులు
నవ్యాంధ్ర రాజధానికి పునాది పడ్డ గుంటూరును దక్కించుకోవాలంటే పార్టీలకు సవాలే. ఈ పరిపాలన కేంద్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకోవాలనే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే ఆశతో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని కసరత్తు చేస్తున్నాయి. పోలింగ్ ముంచుకొస్తున్నందున అభ్యర్థుల ఎంపిక మరింత రసవత్తరంగా మారింది.
గుంటూరులోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒకటి. కిందటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ముస్తఫా విజయం సాధించారు. తెదేపా తరఫున మద్దాలి గిరి పోటీ చేసి ఓడిపోయారు. ముస్లింల ప్రభావం ఎక్కువ ఉండే ఈ స్థానంలో పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రయోగం విఫలమైందని భావించిన తెదేపా ఈసారి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. సినీ నటుడు అలీ వస్తారనే ప్రచారం జరిగినా అనూహ్యంగా ఆయన వైకాపాలో చేరారు. ఇప్పుడు ఏపీ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ హిదాయత్, షౌకత్, షరీఫ్, రియాజ్ నేతలు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సమర్థలెవరనే దానిపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. వైకాపా తరఫున ముస్తఫాకే వైకాపా టికెట్ దక్కే అవకాశాలున్నాయి.
గుంటూరు తూర్పు స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తే తనకు పశ్చిమ నుంచి అవకాశం కల్పించాలని మద్దాలి గిరి కోరుతున్నారు. పశ్చిమ స్థానం నుంచి తెదేపా టికెట్‌పై కిందటి ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాలరెడ్డి గెలుపొందారు. ఇటీవలే ఆయన వైకాపాలో చేరారు. తెదేపా నుంచి వ్యాపారవేత్త కోవెలమూడి రవీంద్ర, ఎన్ఆర్ఐ మన్నవ మోహన కృష్ణ, తెదేపా సీనియర్ నేత, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు టికెట్ కోసం మంతనాలు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి వైకాపాలో చేరిన మోదుగులకు ఆ పార్టీ నుంచి ఇంకా టికెట్ ఖరారు కాలేదు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఏసురత్నం ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఈ సందిగ్ధంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన నుంచి గుంటూరు తూర్పు అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. పశ్చిమ స్థానంలో తోట చంద్రశేఖర్ పేరు ఖరారు చేసిందా పార్టీ.