NEGLIGENCE ON DIET CHRGES: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో మన పిల్లలుంటే ఏం కోరుకుంటామో అచ్చంగా అలాంటి సౌకర్యాలే కల్పించాలని సీఎం జగన్ గతంలో అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలు పెంచాలని.. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 2022 ఆగస్టు 10వ తేదీన వసతి గృహాలపై సమీక్ష సందర్భంగా నిర్దేశించారు.
వసతి గృహాలు, గురుకులాల్లో సీఎం జగన్ మంచి ఆహారాన్ని అందిస్తున్నారని.. మంత్రి మేరుగు నాగార్జున కూడా గతంలో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టలేనంత శ్రద్ధ పెడుతూ.. ఎస్సీ పిల్లలను సొంత మేనమామలా చూసుకుంటున్నారని ఊదరగొట్టారు. కానీ నిజానికి పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. డైట్ ఛార్జీల పెంపుపై 5 నెలల కిందట హడావుడి చేసిన సర్కార్.. దాని తర్వాత నుంచి పట్టించుకోవడం లేదు.
వసతి గృహాల్లో ఆహార జాబితా సక్రమంగా అమలు కావడం లేదన్న పలు పత్రికల కథనాలపై స్పందించిన ప్రభుత్వం.. 2022 ఆగస్టులో ఉన్నత అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. 2018 నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు ఎంత వరకూ పెరిగాయి, డైట్ ఛార్జీలు ఎంత పెంచాలి, జాబితా మార్చాల్సి ఉందా అంటూ.. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలను 2022 సెప్టెంబర్‌లోనే తెప్పించుకుంది.
అనంతరం అమల్లో ఉన్న డైట్ ఛార్జీల ధరలను 25 శాతం వరకూ పెంచాలని జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, 50 శాతం పెంచాలని గురుకులాల ప్రిన్సిపల్స్ కూడా ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒకటీ, రెెండు సమీక్షలు జరిగినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరైన ఆహారం అందక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే.. గురుకులాలు, హాస్టళ్లో చేపట్టే నాడు-నేడు పనులతో.. డైట్ ఛార్జీలకు లంకె పెట్టడంపై అధికార వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి.
గురుకులాలు, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో కలిపి సుమారు 5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వం డైట్ ఛార్జీలను ఒక్కొక్కరికి 250 నుంచి 500 రూపాయలకు పెంచింది. 2019 తర్వాత ప్రభుత్వం మారినా.. నాలుగు సంవత్సరాల క్రితం ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ ఛార్జీలు పెంచాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2021లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి ధరలతో పోలిస్తే మరింత పెంచాల్సి రావొచ్చని సమాచారం. అయితే దీనిపై అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
ప్రస్తుతం ఉన్న ధరలకు నిత్యావసరాలను కొనుక్కుని మెనూ అమలు చేయడం.. తలకు మించిన భారమేనని వసతి గృహ అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం మన్నికగా ఉండాలంటే, పరిమాణాన్ని తగ్గించాల్సి రావచ్చని వాపోతున్నారు. నిర్దేశిత పరిమాణంలో అందించాలంటే నాణ్యతపై కచ్చితంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా హాజరైనా.. విధిలేక ఎక్కువగా ఉన్నట్లు చూపించి సర్దుబాటు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడుతున్నాయని జిల్లాల అధికారులు చెబుతున్నారు. చికెన్, ఎగ్, అరటిపండ్లు, మిల్క్ అందజేతలోనూ కోత విధిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అధికారికంగానే మెనూ కోత వేశారు.
ఇవీ చదవండి: