యడ్లపాడు మండలంలోని కారుచోల గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింగి. ఈ గొడవలో పది మంది గాయపడ్డారు. ఘర్షణలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలతో దాడులు నిర్వహించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లో ఓటు వేసే విషయమై వాదోపవాదాలతో పాటు.. సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టిన విషయంపై వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న చిలకలూరిపేట గ్రామీణ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై రాంబాబులు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.