గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు విరిగిపోవడాన్ని సాంకేతిక సమస్యగానే భావిస్తున్నామని నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. కారణాలపై నిపుణులతో నిజనిర్ధరణ కమిటీ వేస్తున్నామని చెప్పారు. మరమ్మతుల కోసం 3 బృందాలు వచ్చాయని అన్నారు. పోలవరం నుంచి బెకాన్ కంపెనీ ప్రతినిధులు, నాగార్జున సాగర్, తుపాకుల గూడెం నుంచి ఇంజినీరింగ్ నిపుణులు వచ్చారని తెలిపారు.
విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సాయంత్రం నుంచి మరమ్మతుల ప్రక్రియ ప్రారంభిస్తామని.. రేపు సాయంత్రానికి స్టాప్ లాక్ గేట్ ఏర్పాటును పూర్తి చేస్తామని నారాయణరెడ్డి స్పష్టం చేశారు. 11 అంచెల్లో గేటు ఏర్పాటు జరుగుతుందని వివరించారు. ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.