ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణమ్మ ముంచెత్తింది... పెట్టుబడి వరద పాలైంది

నెల రోజుల ముందు వానమ్మ కోసం ఆశగా ఎదురు చూసిన కృష్ణా జిల్లా అన్నదాతలను... వరదలు నిండా ముంచాయి. జలాశయాలు అన్నిటినీ కళకళలాడేలా చేస్తూ ఉరకలు వేసిన క్రిష్ణమ్మ... రైతుకు మాత్రం కన్నీళ్లను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలైపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

By

Published : Aug 19, 2019, 5:36 AM IST

కృష్ణమ్మ ముంచెత్తింది... పెట్టుబడి వరద పాలైంది

కృష్ణమ్మ ముంచెత్తింది... పెట్టుబడి వరద పాలైంది

కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. 4రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు చుక్క నీరు లేని దశనుంచి సమృద్ధిగా వర్షాలు కురవడంతో... అదును దాటిపోయినా పంటలు వేసిన రైతుల ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కృష్ణమ్మ వరద రూపంలో... పంటలు తుడిచిపెట్టుకుపోయింది.

వరి, మొక్కజొన్న, అరటి, పసుపు, కంద, చెరకుతో పాటు... వంగ, మిరప, దొండ పంటలు పూర్తిగా నీటమునిగాయి. ఇప్పటికే పంటలపై వేల రూపాయలు వెచ్చించిన రైతులు... కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో వరద వస్తుందని ఊహించలేదని రైతులు చెబుతున్నారు. పాడైపోయిన పంటను తీసేసి మళ్లీ పంట వేద్దామన్నా... విత్తనాలు దొరికే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్ల తర్వాత కృష్ణానదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో... ఉద్యాన, వాణిజ్య, పండ్లతోటలు పూర్తిగా నీటమునిగాయి. నదికి పులిచింతల నుంచి వరద ప్రవాహం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నా... పొలాల్లో చేరిన నీరు పూర్తిగా పోవడానికి మరో నాలుగైదు రోజులు సమయం పట్టనుంది. నీళ్లు పూర్తిగా పొలాల్లో నుంచి వెళితే తప్ప... పంటనష్టాన్ని అంచనా వేసే అవకాశం లేదు. ఫలితంగా రైతులు పరిహారం పొందడానికి ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండీ...

1957 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు భారీ వరద

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details