మంచినీటి చెరువులో మెుసలి.. భయాందోళనలో ప్రజలు - crocodile
మెుసలిని మామూలుగా జూలో చూస్తేనే భయమేస్తుంది.. అలాంటిది రోజూ ఉపయోగించే మంచినీటి చెరువులో కనిపిస్తే ఏం చేస్తారు? ముందు కనిపించాలి కదా అనుకుంటున్నారా? అయితే గుంటూరు జిల్లా గుండ్లపల్లికి మీరు వెళ్లాల్సిందే.
గుంటూరు జిల్లా గుండ్లపల్లిలో కొంతకాలంగా చెరువులో మెుసలి సంచరిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని ఎవరూ నమ్మలేదు. కానీ శుక్రవారం ఆ మెుసలి గట్టుపైకి రావడంతో రైతులు చూసి గ్రామస్థులకు చెప్పారు. ఈ వార్త ఊరంతా వ్యాపించటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. రైతులందరూ మంచినీటి కోసం ఆ చెరువు వద్దకే వెళ్తుంటారు. ఆ సమయంలో మెుసలి దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.