CPM Madhu on Pavan kalyan: వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనన్న జనసేనాని.. భారతీయ జనతా పార్టీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌పై పునరాలోచన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు సూచించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు దానిని తినడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిన భాజపాతో పొత్తు ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడాన్ని ప్రజలు స్వాగతించరని తెలిపారు.
హైకోర్టు తీర్పు మేరకు రాజధానిలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో సీపీఎం చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. రాజధాని అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.