ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఎందుకిలా?

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలో తొలి కేసు నమోదైన 20 రోజుల్లోనే పాజిటివ్‌ రోగుల సంఖ్య 114కి చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

corona  cases increased day by day in guntur district
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Apr 15, 2020, 12:37 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 10వ తేదీ వరకు 50 కేసులు నమోదుకాగా కేవలం 5 రోజుల్లోనే ఆ సంఖ్య వంద దాటింది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో జిల్లా అగ్రస్థానంలో ఉంది. గుంటూరు జిల్లా కంటే ప్రారంభంలో ఎక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో అక్కడి యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి కట్టడి చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మాత్రం పాజిటివ్‌ కేసులు సంఖ్య తగ్గడం లేదు.

పాజిటివ్‌ కేసులు పరిశీలిస్తే అమెరికా నుంచి వచ్చిన మహిళ ఒకరు కాగా, మిగతా 113 కేసులు దిల్లీ వెళ్లిన వచ్చినవారితో మూలాలు ఉన్నవే. వీరిలో ప్రత్యక్షంగా దిల్లీ వెళ్లివచ్చినవారు 9 మంది కాగా వారి ద్వారా 53 మందికి వైరస్‌ సోకింది. అలా సోకిన వారి నుంచి మిగిలినవారికి విస్తరించినట్లు సమాచారం. జిల్లాలో తొలికేసు నమోదైన వెంటనే ఆప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి రాకపోకలు నియంత్రించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిసిన వారిని గుర్తించి వారందరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేసి నిర్ధరించడంలో కొంత జాప్యం జరిగింది. దీంతో వారంతా కుటుంబసభ్యులు, మరికొందరిని కలవడం వలన వైరస్‌ విస్తరించింది.

స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో...

జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన వెంటనే వారు ఎవరెవరితో కలిశారు? ఎక్కడ తిరిగారు? వంటి వివరాలు రాబట్టడంలో పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. లాక్‌డౌన్‌ విధించక ముందు ఎవరిని కలిశారన్న విషయాలు చెప్పడంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రారంభంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి అనుమానితుల వద్దకు అంబులెన్స్‌లు పంపి తరలించారు.

దీనివల్ల అనుమానితుల తరలింపులో జరిగిన జాప్యం వల్ల ఒకే ఇంట్లో నాలుగుకు మించి పాజిటివ్‌ కేసులు 6 ప్రాంతాల్లో నమోదయ్యాయి. నగరంలో ఉన్నవారు ఇరుకు ఇళ్లలో ఉండటం, ఒకే మరుగుదొడ్డి ఉపయోగించడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ నమూనాలు సేకరించి పరీక్షలు చేయడానికి వెసులుబాటు రావడంతో అనుమానితుల ఇళ్ల వద్దకే వెళ్లి నమూనాలు సేకరిస్తున్నారు. దీనివల్ల వీలైనంత తొందరగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

భౌతిక దూరం పకడ్బందీగా అమలు చేస్తేనే....

రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలుకావడం లేదు. కూరగాయలు, పాలు, మందులు కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులు కొన్నిచోట్ల భౌతిక దూరం పాటించడం లేదు. ఒకరోజు సంపూర్ణ బంద్‌ చేయడం, మరుసటిరోజు సడలింపు ఇవ్వడం వలన ఒకేసారి ఎక్కువ మంది రోడ్లపైకి రావడానికి కారణమవుతోంది. దీనిని గుర్తించిన యంత్రాంగం రోజూ నిత్యావసరాలకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించింది.

ప్రజలు కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. ఈనెల 16 నుంచి బియ్యం, శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈక్రమంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. రెడ్‌జోన్లలో ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తే వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇందుకు అదనంగా రవాణా, సంచుల భారం పడనుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చదవండి:

శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details